తెలుగుదేశం పార్టీ మూతపడనుందా? | Will the Telugu Desam Party shut down?
తెలుగుదేశం పార్టీ మూతపడనుందా? : మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఎక్కువుగా వినిపిస్తున్న మాట. ప్రస్తుత టిడిపి పరిస్తితి చూస్తుంటే ఈవార్తలన్నీ నిజమయ్యేలానే ఉన్నాయి. NTR కాలం నుండీ ఎన్నో సేవలందించిన టిడిపి పార్టీ ఇలా మటుమాయమవ్వడం ఒకింత ఆంధ్రా ప్రజలకు జీర్ణించుకోలేని విషయమే. నిజం చెప్పాలంటే ఎన్‌టిఆర్ తరువాత టిడిపిని సక్రమంగా నడిపింది కేవలం చంద్రబాబు మాత్రమే! టిడిపి పార్టీని ఇంతకాలం ఇంత సక్సెస్ ఫుల్ గా నడిపే శక్తి సామర్ధ్యాలు చంద్రబాబుకు తప్ప ఎన్‌టిఆర్ పిల్లలకు గాని, కూతుర్లకు గాని, చంద్రబాబు మినహా మిగతా అల్లుళ్ళకు గాని లేవు. ఇది ప్రతివారికీ తెలిసిన విషయమే. ఇక చంద్రబాబు తరువాత పార్టీని బ్రతికించుకుని ముందుకు తీసుకు వెళ్ళే సత్తా కూడా ఎవరికీ లేదు. ఆయన తనయుడు లోకేశ్ కూడా లేదు. వచ్చి ఏదో ఉద్దరిస్తాడని అనుకుంటున్న జూనియర్ ఎన్‌టిఆర్ కు అసలే లేదు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఎవరి రంగం వారిదే. ఏ రంగానికి సంబంధించిన వారు ఆ రంగంలోనే రాణించగలరు తప్ప మరొక రంగంలో రాణించడం చాలా కష్టమే. చివరికి ప్రజలు కూడా ఏ రంగంలో వారిని ఆ రంగంలోనే చూస్తారు తప్ప మరొక రంగంలో చూడరు. ఈ విషయం చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల విషయంలో నెరవేరడం మనం చూసాం కదా ? మరి జూనియర్ ఎన్‌టిఆర్ ఎలా రాణించగలడు? మరొక కోణంలో చూస్తే జూనియర్ ఎన్‌టిఆర్ కంటే పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఎక్కువ..అయినప్పటికీ 2019 ఎలక్షన్స్ లో ఎన్ని సీట్లు వచ్చాయో మనకు తెలుసు కదా? ఆఖరికి పోటీ చేసిన రెండు చోట్లా కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. దీన్ని బట్టన్నా మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రజలు సినిమా హీరోలనూ, రాజకీయ నాయకులనూ కలిపి చూడలేరని. ఇవి ఎన్‌టిఆర్ ఉన్నప్పటి రోజులు కావు.
ఇవన్నీ ఆలోచించుకున్న టిడిపి నాయకులు ఒకొక్కరూ పార్టీని వదిలిపోతున్నారు. నాకు తెలిసి అధికార పార్టీ వైయస్సార్ సిపి బెదిరించిన మాత్రాన భయపడిపోయి పార్టీని వదులుతున్నారనుకోవడం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమనుకుంటుంటే ఆ భయంతోనే ఎన్నాళ్లు భయపెట్టిన పార్టీలో ఉండగలరు? బ్లాక్ మెయిల్ ద్వారా వచ్చిన లీడర్ల వలన అధికార పార్టీకి ప్రమాదం ఉండదా? అదును దొరికినప్పుడు వీళ్ళందరూ ఆ పార్టీని ముంచేయలేరా? బెదిరింపులకు లోబడి వెళ్ళిన వాడికి అక్కడ విలువ ఉంటుందా? వెళ్ళినవాడు అక్కడ హుందాగా ఉండగలడా? ఒకవేళ వీళ్ళు వెళుతున్నారంటే అధికార పార్టీ చూపించే అత్యాశలకు ప్రలోభాలకే తప్ప బెదిరింపులకు కాదు.. ఎలానూ రాజకీయ నాయకులకు ఎంత తిన్నా ఖాళీ కడుపే ఉంటుంది కాబట్టి తమ స్వార్ధాల కొద్దీ ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి దూకేవాళ్లే. పశువులు ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడకే పరుగెడతాయి.
పదుల కొద్దీ కేసులు మీదేసుకుని బెయిల్ మీదున్న జగన్ కు వీళ్ళందరూ నిజంగా భయపడిపోతున్నారు అనుకుంటే దానంత అజ్ఞానం లేదు. ఏక్షణం ఏమవుతుందో తెలియని భయంతో ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారి గురించి ఈ రాజకీయులు భయపడతారా? భయపడి పార్టీ మారతారా? అది నిజమే కాదు.
ఇక అసలు విషయానికొస్తే తెలుగుదేశం పార్టీ నా అభిప్రాయం ప్రకారం మూతపడిపోవడం ఖాయం. ఇది చంద్రబాబుతో ముగిసిపోయినట్లే! చంద్రబాబు ఉన్నoతకాలం ఇది కొస ప్రాణంతో ఉన్నా తరువాత సమసిపోవడం తధ్యం అనిపిస్తోంది. ఎందుకంటే పార్టీని బ్రతికించాలన్నా, నడిపించాలన్నా బలమైన నాయకత్వ లక్షణాలున్న నాయకుడు కావాలి.. ఆ నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కనిపించడం లేదు. నా వరకూ నేను చంద్రబాబుగారి విజన్ ప్రేమించేవాడిగా తెలుదూదేశం పార్టీ పునర్జీవితం పోసుకోవాలనే కోరుకుంటున్నాను.
జూనియరుడు లేదా ఇతర నందమూరి/నారా/అనుబంధకుటుంబాల సభ్యులు లేదా వారసులు ఎవరూ ఏమీ పొడవలేరన్న మీ విశ్లేషణతో 100% ఏకీభవిస్తాను.
ReplyDeleteటీడీపీకి మంగళం పాడేయడం మాత్రం అంత వీజీ కాదు. పార్టీలో జనం నాడి తెలిసిన ఎందరో నాయకులు (ఉ. ధూళిపాళ నరేంద్ర) ఉన్నారు. విజన్ టెలీవిజన్ అంటూ చంద్రబాబు & అతని కోటరీ చేసిన హంగామా మూలాన ఇటువంటి వారిని కరివేపాకు అయిపోయి దద్దమ్మలు పెత్తనం చెలాయించినందుకే ఇప్పటి పరిస్థితి.
ఇప్పటికయినా తత్త్వం బాధపడి దిద్దుబాటు చర్యలు మొదలెడితే తిరిగి పునర్వైభవం అసాధ్యం కాదు. గ్రాఫిక్కులు జిమ్మిక్కులు ఎల్లో మీడియాలో భజన పరంపరలు మానేసి ఊళ్లలో (ముఖ్యంగా దళితవాడలలో & అట్టడుగు జనం ఉండే గూడాలలో) తిరగాలి. "అన్నీ తెలుసు, నేనే మేధావిని" అనే డప్పు కొట్టడం ఆపేసి "మీకు ఏమి కావాలో చెప్పండి" అనడం నేర్చుకోవాలి. భ్రమరావతి తిండి పెట్టదు, తిండి పెట్టే రైతులు & రైతు కూలీల నోట్లో నాలుగు వేళ్ళు వెళ్ళితే వాళ్ళే మనను అక్కున చేర్చుకుంటారన్న సత్యం గుర్తించాలి.
అవును. మీరు చెప్పింది నిజం
Delete